Mellaga Tellarindoi

మెల్లగా తెల్లారిందో ఎలా
వెలుతురే తెచ్చేసిందో ఇలా
బోసినవ్వులతో మెరిసే పసిపాపల్లా

చేదతో బావులలో గలగల
చెరువులో బాతుల ఈతల కళ
చేదుగా ఉన్నా వేపను నమిలే వేళ

చుట్టపొగమంచుల్లో, చుట్టాల పిలుపుల్లో
మాటలే కలిపేస్తూ మనసారా
మమతల్ని పండించి అందించు హృదయంలా

చలిమంటలు ఆరేలా, గుడిగంటలు మోగేలా
సుప్రభాతాలే వినవేలా
గువ్వలు వచ్చే వేళ, నవ్వులు తెచ్చే వేళ
స్వాగతాలవిగో కనవేలా

పొలమారే పొలమంతా, ఎన్నాళ్లో నువ్వు తలచి
కళ మారే ఊరంతా, ఎన్నేళ్లో నువ్వు విడచి

మొదట అందని దేవుడి గంట
మొదటి బహుమతి పొందిన పాట
తాయిలాలకు తహతహలాడిన పసితనమే గురుతొస్తుందా

ఇంతకన్నా తియ్యనైన జ్ఞాపకాలే
దాచగల రుజువులు ఎన్నో ఈ నిలయాన

నువ్వూగిన ఉయ్యాల ఒంటరిగా ఊగాలా
నువ్వెదిగిన ఎత్తే కనబడక
నువ్వాడిన దొంగాట బెంగల్లే మిగలాలా
నన్నెవరూ వెతికే వీల్లేక

కన్నులకే తియ్యదనం రుచిచూపే చిత్రాలే
సవ్వడితో సంగీతం పలికించే సెలయేళ్లే

పూలచెట్టుకి ఉందో భాష
అలల మెట్టుకి ఉందో భాష
అర్థమవ్వని వాళ్ళే లేరే అందం మాటాడే భాష

పలకరింపే పులకరింపై పిలుపునిస్తే
పరవశించడమే మనసుకి తెలిసిన భాష

మమతలు పంచే ఊరు, ఏమిటి దానికి పేరు
పల్లెటూరేగా ఇంకెవరూ
ప్రేమలు పుట్టిన ఊరు, అనురాగానికి పేరు
కాదనేవారే లేరెవరూ



Credits
Writer(s): Srimani, Mickey J Meyer
Lyrics powered by www.musixmatch.com

Link